శృంగారం ద్వారా కొవిడ్-19 వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల వీర్యం లేదా వృషణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు ఆధారాలేమీ లేవని తేలింది. ఎబోలా, జికా, కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్‌ల తరహాలో కొవిడ్-19 కారక ‘సార్స్-కోవ్-2’ కూడా శృంగారం ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా చైనాలో 34 మంది రోగుల వీర్యం నమూనాలను విశ్లేషించారు. వీటిలో వైరస్ కనిపించలేదు. అయితే వీర్యం తయారయ్యే వృషణాల్లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించలేదని నిర్ధారణ చేసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
డేటా విశ్లేషిస్తే...
ఈ అంశంపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు.. ఆరోగ్యవంతులైన యువకులకు సంబంధించిన ‘సింగిల్ సెల్ ఎంఆర్‌ఎన్‌ఏ’ నుంచి సేకరించిన మునుపటి డేటాను విశ్లేషించారు. వృషణాల్లోని కణాల్లో ప్రొటీన్ల తయారీకి ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వీలు కల్పిస్తుంది. అందులో కొవిడ్-19తో ముడిపడిన ఏసీఈ-2, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్2 జన్యువులపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఇవి రిసెప్టార్లలా పనిచేస్తూ కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశానికి వీలుకల్పిస్తాయి. ఈ రెండు రిసెప్టార్లు ఒకే కణంలో ఉంటేనే ఆ వైరస్ సమర్థంగా అందులోకి ప్రవేశిస్తుంది. అయితే 6500 వృషణ కణాలకుగాను నాలుగింటిలోనే ఈ రెండు ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఉన్నాయని తేలింది. అందువల్ల మానవ వృషణ కణాల్లోకి ఈ వైరస్ చొరబడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చాలా ప్రాథమిక స్థాయి అధ్యయనమని, మరింత లోతుగా పరిశీలన సాగాలని వారు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ప్రధానిని పేరుతో పిలవాలంటే భయమేసింది'