అందం విషయంలో కేశాలు ఎంతో ప్రధానం. నల్లటి, ఒత్తయిన జుట్టు ఉన్నవారు మరింత ఎక్కువ అందంగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ తమ కేశాలు అందమైన అలల్లా ఎగసిపడాలని, పొడవుగా ఉండాలని, నల్లగా ఉండాలని ఇలా ఎన్నో కలల కంటూ ఉంటారు. కానీ ఉద్యోగాలు, ఇంటి పనుల్లో తీరిక లేదని ఎవరూ కేశాల పోషణను పెద్దగా పట్టించుకోరు.
ప్రస్తుతం లాక్డౌన్ వల్ల మన దగ్గర చాలా సమయం ఉంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించి మీ జుట్టును సంరక్షించుకోవాలని చెబుతున్నారు చర్మవ్యాధి నిపుణురాలు డా. శైలజ సూరపనేని.
" జుట్టు సంరక్షణలో మనం తీసుకునే ఆహారం చాలా ప్రభావం చూపుతుంది. శిరోజాల సౌందర్యంపై శ్రద్ధ పెట్టి కొన్ని చిట్కాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా జుట్టు సంరక్షణకూ మాస్క్లు ఉపయోగించాలి.
ప్రస్తుతం ఫ్యాషన్ పేరుతో ఎవరూ జుట్టుకు సరిగా నూనె రాసుకోవడం లేదు. ఇది జుట్టు దెబ్బతినడానికి ఓ ప్రధాన కారణం. ఇంట్లో తయారు చేసే ఆహారం మన కేశాలు, చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది."
--- డాక్టర్ శైలజ సూరపనేని, చర్మవ్యాధి నిపుణురాలు
శిరోజాల సౌందర్యానికి ఇవి చాలా ముఖ్యం
కేశాల సంరక్షణకు పౌష్టికహారం చాలా ముఖ్యం. ఇందుకు అవసరమైన విటమిన్లు, అవి లభించే పదార్థాల వివరాలు మీకోసం..
1. విటమిన్ ఎ: బంగాళా దుంప, క్యారెట్, గుమ్మడికాయ, బచ్చలికూర, పాలు, గుడ్లు
2. విటమిన్ బి: పప్పులు ముఖ్యంగా మినపపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, బాదం, మాంసం, చేపలు, పచ్చి ఆకుకూరలు
3. విటమిన్ సి: స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, సిట్రిక్ అధికంగా పండ్లు, బత్తాయి, నారింజ, సీజనల్ పండ్లు(ఉదా. మామిడి, సపోటా మొదలైనవి)
4. విటమిన్ డి: చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, బలవర్ధక ఆహారం
5. విటమిన్ ఇ: పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, బచ్చలికూర, పాలకూర, వేరుశెనగలు
6. జింక్: బచ్చలికూర, పాలకూర, గుమ్మడి విత్తనాలు, గోధుమలు
7. ప్రోటీన్స్: మాంసం, చేపలు, పాలు
- ఒత్తిడి లేకుండా ఉండటం అందానికి, ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇందుకు ధ్యానం, యోగా వంటివి చేయడం చాలా మంచిది.
- తలకు స్నానం చేసేటప్పుడు వేడి నీరు ఉపయోగించకూడదు. వేడి నీటి వల్ల కేశాలు తొందరగా పాడవుతాయి.
- తరచూ రాత్రి వేళల్లో కేశాలకు నూనె రాసుకోవాలి. నూనెతో మర్దన చేసి పొద్దున్నే తలను కడిగేయాలి.
కేశాలకూ మాస్క్లు...
ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుకోవడానికి ముఖానికి మాస్క్లు వేసుకుంటున్నాం. ఇదే విధంగా శిరోజాలను సంరక్షించుకునేందు మాస్క్లు వేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవి
- గ్రీన్ టీ మాస్క్
జుట్టుకు గ్రీన్ టీ మాస్క్ వేసుకునేందుకు ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడి తీసుకొని రెండు చెంచాల కొబ్బరి నూనెలో కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగేయండి.
- ఎగ్ మాస్క్
ఎగ్మాస్క్ కోసం రెండు గుడ్లు తీసుకోవాలి. ఇందుకు వాటిలోని తెల్లసొనకు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, 1 కప్పు పాలతో కలపాలి. తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. తర్వాత దీన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఇదీ చదవండి: ఆ ఇద్దరు అర్చకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్!