కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా.. కూలీల కొరత, వర్షాల వల్ల పనులు నెమ్మదించినా, పనులకు ఆటంకం కలిగినా వాటన్నింటినీ అధిగమించినట్లు వైటీడీఏ ఛైర్మన్ కిషన్‌రావు పేర్కొన్నారు. ప్రధానాలయం 90 శాతం వరకు పూర్తి చేశామని వెల్లడించారు. ఆలయ స్థపతులు, శిల్పులు, ఆర్కిటెక్చర్, వైటీడీఏ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఆలయ పనులకు, వర్షాల వల్ల తలెత్తిన లీకేజీలు సరిచేయటం, ఆలయ మాడవీధుల్లో ఫ్లోరింగ్ మరమ్మతులు చేపట్టడం ఆలయ మండప ప్రాకారాలలో శిల్పులతో తుది మెరుగులు దిద్దడం, వంటి పనులు పరిశీలిస్తూ చేపడుతున్నామని అన్నారు. సీఎం, చిన జీయర్ స్వామి సలహాల సూచనలతో ఆలయ పునర్నిర్మాణం పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారమే చేపట్టామని వెల్లడించారు.
1,900 ఎకరాల భూమిని తీసుకోవడం.. రింగ్ రోడ్డు పనులు రాయగిరి నుంచి గుట్టకు వచ్చే రహదారి అభివృద్ధి, టెంపుల్ సిటీ డెవలప్మెంట్, భక్తులకు కావాల్సిన అవసరాలను సమకూర్చే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే యదాద్రికి 11, 12 సార్లు ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ పర్యటించారని అన్నారు.