యాదాద్రి .... అలనాటి యాదగిరిగుట్ట నేటి నవ్య నిర్మాణాల యాదాద్రి
యాదాద్రి ... ఒకప్పటి యాదగిరి గుట్ట... లక్ష్మీనరసింహ పురాతన క్షేత్రం
నాడు ... స్థానికులకి మాత్రమే పవిత్రక్షేత్రమనిపించుకున్న వాకిలి
నేడు ...ఎందరినో అలరించే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయ లోగిలి
ఒకప్పుడు తెలంగాణాకే తిరునాళ్ల జాతర కొలుపుల స్థలి...
ఇకపై ప్రపంచ ప్రజలనాకర్షించే పంచనారసింహుని గుడి...
అదే... అదిఅదియే ... శ్రీశ్రీశ్రీ యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి మహాదేవస్థానం
కనులముందు ఇలవైకుంఠంలా...
2016 వ సంవత్సరం అక్టోబర్ 11న రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ బృహత్కార్యక్రమానికి తొలి అడుగు వేశారు. కొండగుహల్లో కొలువుండి కోటికాంతుల వెలుగులు వెలిగే యాదగిరీశుని క్షేత్ర వైభవ విస్తరణ చేయాలని పలుగూపార- ఇటుక సిమెంట్‌ల పూజచేశారు. అందుకు నడిచే నరనారాయణస్వరూపుడు చినజీయర్‌స్వామివారి ఆధ్యాత్మిక వెన్నుదన్ను... వేయి ఏనుగులపాటి బలం తోడైనట్లయింది. పనులు చకచకా మొదలై, అంగరంగ వైభవ భవ్యనిర్మాణాలతో తుది దశకు చేరింది. అల యాదగిరిగుట్ట కనులముందు ఇలవైకుంఠంలా వెలిసినట్లయ్యింది.
నవగిరిగా ముస్తాబు
ఓ తిరువనంతపురమంతటి, ఓ శ్రీరంగమంతటి, ఓ తిరుపతి మహాక్షేత్రమంతటి హరిన్నివాసం సిద్ధమైంది. ఒకనాడు ముఖ్యమంత్రివర్యులతో పాటు గగనవిహారం చేస్తూ చినజీయరుల వారికి కంటికగుపించిన తొమ్మిది కొండల్ని ఇదుగో ... ఇలా నవగిరిగా ముస్తాబు చేశారు. 1200 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్టుతో ఓ అద్భుత దేవాలయాన్ని కళ్లముందు నిలబెట్టారు. 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన మట్టికొండను అందుకు అనువుగా అమర్చారు.
ఆఘమేఘాలమీద
మహా దివ్య ఆలయంగా నిర్మించే పనులను.. యాదాద్రి ఆలయాభివృద్ధి అధికార సంస్థ- యాడా.. పర్యవేక్షించింది... లక్ష్మీసమేతంగా కొలువై ఉన్న యాదగిరిగుట్ట ఆలయ వైభవ విస్తరణ ... ఆఘమేఘాలమీద పరిపూర్తయ్యింది. కేవలం ఐదేళ్లలో పాంచరాత్ర, ఆగమ, శిల్ప, వాస్తులకు అనుగుణమైన దివ్యాలయం పూర్తయ్యింది. ఇక మూలవిరాట్టు పునః ప్రాణ ప్రతిష్ట, పార్శ్వదేవతల పునఃస్థాపన, ధ్వజస్తంభాల ప్రతిష్టాపనలు చేసుకుని, భక్తుల దర్శనానికి కొబ్బరికాయ కొట్టే శుభముహూర్తమే మిగిలింది.
ఇదీ చదవండి: తిరుమలలో శ్రీవారికి వైభవంగా తెప్పోత్సవం