దేశంలో మరెక్కడా లేని విధంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో ఆలయ దివ్య విమానాన్ని స్వర్ణ మయంగా మార్చేందుకు యాడా పునరాలోచిస్తోంది. పంచ నారసింహులు వెలసిన గర్భాలయంపై గల విమానాన్ని మహా దివ్యంగా రూపొందించేందుకు ప్రాధికార సంస్థ... వ్యయంపై స్వర్ణ కవచాల తయారీ నిపుణులతో చర్చించేందుకు ప్రయత్నిస్తోంది. చినజీయర్ స్వామి సలహా, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో యాడా తాజాగా ఈ కసరత్తులు చేపట్టింది.
45 అడుగుల ఎత్తులో గల సదరు విమాన గోపుర స్వర్ణకవచం కోసం... ఎంత బంగారం అవసరం అవుతుందనే అంశంపై నిపుణులతో చర్చించాక సీఎం దృష్టికి తేనున్నట్లు యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావ్ తెలిపారు. పునర్నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్న దశలో తుది మెరుగులతో పాటు తిరుమల శ్రీవారి ఆలయ గోపురం తరహాలో యాదాద్రి గోపురాన్ని స్వర్ణ తొడుగుతో తీర్చిదిద్దే పనులపై దృష్టి సారించారు. ఎంత స్వర్ణం అవసరమవుతుందో అంచనా వేసి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున 'కోటి వృక్షార్చన'