దళితబందు పథకం అమలు(Dalit Bandhu Scheme in Telangana)లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న యదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో లబ్ధిదారులకు మంత్రి జగదీశ్ రెడ్డి యూనిట్లను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,జిల్లా ప్రజారిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు అధ్భుతమైన విప్లవాన్ని తీసుకురాబోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా లబ్ధిదారులు ఎంచుకున్న రంగాల్లో అభివృద్ధి సాధించాలని జగదీశ్ రెడ్డి సూచించారు.
"ముఖ్యమంత్రి కేసీఆర్.. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. వారి ప్రగతి కోసమే దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కేవలం ఎన్నికల కోసమే ప్రవేశపెట్టిన పథకం కాదు. దీనిద్వారా ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతోంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఎవరిముందు చేయిచాచకుండా.. వారు చేయాలనుకున్న దానికి పెట్టుబడి పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా ఎక్కువ మంది వాహనాలే తీసుకున్నారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది."
- జగదీశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
వాసాలమర్రిలో దళిత బంధు పథకం(Dalit Bandhu Scheme in Telangana) క్రింద 10 మంది లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లలో ఆటోలు, డోజర్లు,ట్రాలీ వాహనాలు ఉన్నాయి. యూనిట్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
"మా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. దళితబంధు ద్వారా మేం ఆటోలు, డోజర్లు, ట్రాలీ వాహనాలు తీసుకున్నాం. ఇక మేం సొంతంగా మా వాహనాలు నడుపుకోవచ్చు. మా కుటుంబాలను పోషించుకోవచ్చు. ఈ పథకం మా లాంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది."
- లబ్ధిదారులు
దళితబంధు పథకం(Dalit Bandhu Scheme in Telangana) కింద యూనిట్లు తీసుకున్న లబ్ధిదారులు,పలువురు గ్రామస్థులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ.... సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన యూనిట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుదలకు కృషిచేస్తామని స్పష్టం చేశారు.