Shree Lakshmi Narasimha Swamy kalyanam: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ కొండపై స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువుగా జరిగింది. ముందుగా గజవాహన సేవపై ఆలయ తిరువీధుల్లో ఉరేగించి స్వామి వారికి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల, కరతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా నరసింహస్వామి వారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో ఆలయ తిరువీధుల ప్రాంగణం "నమో నారసింహ, జై నారసింహ, గోవిందా" నామస్మరణతో మార్మోగింది. స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తూ ఆనందపరవశులైనారు.
సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి మొత్తం ఈ కల్యాణ వేడుకను తనివితీరా వీక్షించి పరవశించారని వేదపండితులు భక్తులకు ప్రవచించారు. రాత్రి 9.30 నిమిషాలకు తుల లఘ్న సుముహూర్తమున లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళ సూత్రధారణ గావించారని, స్వామివారి కరుణాకటాక్షములు అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు వివరించారు.
రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు రెండు గంటల పాటు వైభవంగా జరిగింది. స్వామి వారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎం సతీమణి శోభ, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు సమర్పించారు.
ఆలయ పునర్ నిర్మాణం అనంతరం తొలిసారిగా ఈ వేడుకలు జరిగడంతో అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. స్వామి వారి కల్యాణం కొండపై ఆలయ సన్నిధిలో నిర్వహించడంతో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ మాడవీధులు భక్తులతో నిండిపోయాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు వీఐపీలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆలయంలో రద్దీ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 350 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనట్లు అధికారులు తెలిపారు. కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఇవీ చదవండి:
యాదాద్రిలో ఘనంగా ఎదుర్కోలు మహోత్సవం.. నేడే స్వామి వారి కల్యాణం
యాదాద్రిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు.. పాల్గొన్న ప్రముఖులు
యాదాద్రిలో 'మెట్ల మెట్టుకు పతనర్తనం'.. కూచిపూడి నృత్యంతో అలరించిన చిన్నారులు