చేనేత పరిశ్రమ పరిరక్షణకై నేత కార్మికులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో చేపట్టిన దీక్షలకు మద్దతుగా రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు మండ్యం బాబురావు, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ , తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కోమటి సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.
తెలంగాణలో కరోనా సమయంలో చేనేత కార్మికులు పనులు లేక పస్తులు ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. నేతన్నల సామాన్య కోర్కెలు ప్రభుత్వ వెంటనే తీర్చాలని వారు కోరారు. తాము శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం కేసులు పెట్టడం సరికాదన్నారు. చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్లు కేటాయించాలన్నారు. చేనేత కార్మిక కుటుంబాలకు నెలకు రూ. 8000 చొప్పున ఆరు నెలల పాటు ప్రభుత్వమే జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు.
కరోనా సమయంలో ఉత్పత్తి అయి నిలిచిపోయిన చేనేత వస్త్రోత్పత్తులను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, 40 శాతం నూలు సబ్సిడీని ప్రతి చేనేత కుటుంబానికి నెలకొకసారి అందించాలని కోరారు. చేనేత త్రిఫ్టుఫండ్ పథకాన్ని పునరుద్ధరించి జులై నుంచి డిసెంబర్ 2020 వరకు రాష్ట్ర ప్రభుత్వమే చేనేత కార్మికులందరికీ వాటా చెల్లించాలని, వారసత్వ కళైన చేనేత వృత్తికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..