Rathotsavam at Yadadri : యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా 9వ రోజైన బుధవారం స్వామి వారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడ వాహనసేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణుమూర్తి అలంకారంలో గరుడ వాహనంపై ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు.
వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ ధగధగ మెరిసిపోయారు. అనంతరం లక్ష్మీ సమేత నారసింహుడున్ని రాత్రి 7 గంటల నుంచి ఆలయ తిరువీధుల్లో స్వామివారి రథోత్సవం వైభవంగా జరిపారు. ఇవాళ ఉదయం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. మొదటగా ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కొండపైన ఆలయ తిరువీధుల్లో దివ్య విమాన రథోత్సవం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారిగా రథోత్సవ తంతును కొండపై నిర్వహిస్తుండటంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆలయ పునఃప్రారంభం తరువాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం నిన్న కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారు అమ్మవారి మెడలో తాళికట్టారు. ఈ మహోత్సవానికి సీఎం కేసీఆర్ సతీమణి శోభ, పలువురు మంత్రులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు ఆటో డ్రైవర్ల నిరసన: యాదగిరి గుట్ట ప్రధానాలయం పునఃప్రారంభం నుంచి కొండపైకి ఆటోలను అనుమతించక పోవడంతో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఫైనాన్స్, బంగారం తాకట్టు పెట్టి ఆటోలు కొనుగోలు చేశామని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇంటి ముందు కూర్చుని నిరసన దీక్ష చేశారు. ఏడాది కాలంగా సుమారు 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయ ఉంచి ఆటోలను కొండ మీదకి అనుమతించాలని వారు కోరారు.
ఇవీ చదవండి: