పాలకుల దౌర్జన్యాలను ఎదురించే ప్రజల గొంతుక బలపడాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో నిరుద్యోగుతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఏ ఆశయ సాధన కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో.. నేటికీ ఆ కల సాకారం కాలేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ఊసే లేదన్న ఆయన... తెరాస పాలనలో ప్రభుత్వ ఫలాలు పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయిన కవితను రెండేళ్లలో ఎమ్మెల్సీగా గెలిపించుకున్న సీఎం కేసీఆర్... మరి తెలంగాణ బిడ్డల గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. ఈ దుర్మార్గమైన పాలనను కొనసాగించడమా? లేదా ? అనేది ఓటర్లు నిర్ణయించుకోవాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రభుత్వ అహంకార, నిరంకుష పాలనకు మధ్య సాగుతున్న ఘర్షణగా కోదండరాం పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అసమ్మతి: మంత్రి కార్యక్రమాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు