New Year Temples Rush in Telangana 2024 : ఎంతో సంబురంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికిన తెలంగాణ ప్రజలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే ఆలయాలకు తరలివెళ్లారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ప్రజలతో పాటు ప్రముఖులు కూడా గుళ్లకు క్యూ కట్టారు.
Kishan Reddy Tirumal Visit Today : నూతన సంవత్సర వేళ పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శ్రీవారి ఆశీస్సులతో ప్రజలందరికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు ఆకాంక్షించారు. 2024 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
షిరిడీ సాయిబాబాను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినీ నటుడు సుమన్‌లు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని యాదాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 2 గంటలు సమయం పట్టింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు నూతన సంవత్సర వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.
'కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాములవారిని ప్రార్థించాం'
కొత్త సంవత్సరంతో పాటు సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు ముందుగా రాజన్నను దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్త జనం పోటెత్తడంతో గర్భాలయంలోని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఆలయంలో కోడెలను తిప్పుతూ స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఓరుగల్లులోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు.
రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం- అయ్యప్పను దర్శించుకున్న 32 లక్షల మంది భక్తులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి