యాదాద్రి భువనగిరి జిల్లాలో పంచనారసింహుల క్షేత్రం యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు విశేష పర్వాలు కొనసాగుతున్నాయి. లోకకల్యాణార్థం జరిగే స్వామివారి కల్యాణవేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మహోత్సవంలో ముందస్తుగా సంబంధాన్ని ఖాయపర్చుకునే ఘట్టాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు.
ఇవాళ ఏం జరుగుతున్నాయంటే..
ఉదయం జగన్మోహినీ అలంకార సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి అశ్వవాహన సేవ పూర్తి కాగానే... ఎదుర్కోలు ఉత్సవాన్ని జరుపుతారు. ఇందుకోసం ఆలయంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
బాలాలయంలో కొందరికే అవకాశం..
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాల దృష్ట్యా బాలాలయంలోనే ఈసారి కల్యాణ క్రతువు చేపడుతున్నారు. ఉదయం స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుండగా.. అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది, ఇతర ప్రముఖులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొంటారు.
వేలాది భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
బుధవారం రాత్రి కొండ కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగే కల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి జరిగే రథోత్సవం కూడా... అటు బాలాలయంలో, ఇటు కొండ కింద నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల