ఈ నెల 12న ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వినాయక్ చౌరస్తా వద్ద కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రగతి భవన్ని ముట్టడిస్తే 31 మంది విద్యార్థి నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్రమంగా పీడీ యాక్ట్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ప్రగతిభవన్ బద్దలు కొడతాం...
విద్యార్థుల సమస్యలు ఫీజు రీయంబర్స్మెంట్, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. విద్యార్థి సమస్యలపై గొంతెత్తుతే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం పనులు చేశారన్నారు. 1100 మంది విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ వల్ల కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే ఖబర్దార్ అంటూ కేసీఆర్ వైఖరిని తూర్పరబట్టారు. అక్రమ అరెస్టులు ఇలాగే కొనసాగితే ప్రగతి భవన్ గోడలను బద్దలు కొడదామని ఆయన హెచ్చరించారు.
ఇవీ చూడండి : 'నీరా ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం'