యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, మోటకొండూరు, తుర్కపల్లి, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు చేరింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
యాదగిరిగుట్ట పట్టణంలో రాత్రి నుంచి కురుస్తోన్న వర్షాలతో పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచింది. రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోటకొండూర్ మధిర గ్రామమైన రాయికుంటపల్లిలో పిడుగుపాటుతో మల్గ నవీన్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో 2 దూడలు మృతి చెందాయి. వాటి పక్కనే ఉన్న నవీన్ స్పృహ కోల్పోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
గుండాల, రాజపేట మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజపేట మండలంలో సుమారు 3 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మొత్తంగా యాదగిరిగుట్టలో అత్యధికంగా 13.3, బొమ్మల రామారం మండలం మర్యాలలో 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.