యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తోంది. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూరు మండలాల్లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో కొంతమేర పత్తి, వరి పంటలు నీట మునిగాయి. వరదనీటితో యాదగిరిపల్లిలోని ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. రాకపోకలకు అంతరాయం కలగకూడదని.. పోలీసులు అటువైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో చాలా చోట్ల డ్రైనైజీలు పొంగిపొర్లి ఇళ్లలోకి చేరుకుంటున్నాయి. ఆలేరులో చెరువులు, కుంటలు నిండి.. అలుగులు పోసి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజపేట మండలం చల్లూరు గ్రామంలో కురిసిన వర్షానికి ఓ ఇల్లు కుప్పకూలింది. ఎలాంటి ప్రాణనష్టం జరగనందున స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి: వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షాలు