యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా కొండ కింద రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిచెర్లను భక్తులకు అవసరమైన ఏర్పాట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి యాడ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కట్టడాలను భక్తిభావం ఉట్టిపడేలా నిర్మించడం కోసం పేరొందిన సంస్థలతో చర్చిస్తోంది.
ఆ తొంభై ఎకరాల్లో ఆధ్యాత్మిక కేంద్రం..
బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలను నిర్వహించుకునేందుకు వీలుగా సుందరీకరణ పనులుండాలని సీఎం కేసీఆర్ శనివారం యాడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొండమీద ఆలయాలు, ప్రసాద విక్రయ కేంద్రాలు మాత్రమే ఉంటాయి. దిగువన గండిచెర్ల దగ్గరున్న 90 ఎకరాల్లో యాత్రికులు మొక్కులు తీర్చుకునే ఏర్పాట్లకు, ప్రవచన మందిరాల నిర్మాణాలకు యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రణాళికలు తయారు చేస్తోంది.
అన్ని సదుపాయల రూపకల్పన...
స్వామివారి తెప్పోత్సవం కోసం పుష్కరిణిని రూపొందిస్తున్నారు. పుణ్య స్నానాల కోసం పుష్కరిణిలో ఘాట్లు, పక్కనే దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మిస్తారు. యాత్రికుల కోసం అల్పాహార, భోజన కేంద్రాలను, తలనీలాల మొక్కుల సమర్పణ కోసం కల్యాణ కట్ట ఏర్పాటు చేస్తున్నారు. ఇది 500 మందికి సరిపడేంత విశాలంగా ఉంటుందని తెలిపారు. మండలదీక్ష భక్తుల కోసం వంద మందికి సరిపడా ప్రత్యేక సముదాయం. సామాన్య భక్తుల బసకు మరొక సముదాయం నిర్మిస్తారు. నిత్యాన్నదానం అందించేందుకు వెయ్యి మంది భక్తులు సరిపడా భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలను యాడా సిద్ధం చేసింది. అదే ప్రాంగణంలో బస్ స్టేషన్కు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: నిర్దేశిత సమయానికే యాదాద్రి ఆలయ పనులు పూర్తికావాలి: కేసీఆర్