యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో136, తుర్కపల్లి 74.8, రాజపేట 52, ఆలేరు 35.6, బొమ్మలరామారం 52.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో స్థానికంగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో వరద ఉద్ధృతికి.. నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు నీట మునిగాయి. మరోవైపు భారీ వర్షానికి తోపుగాని చెరువు ప్రమాదకరంగా అలుగు పోస్తోంది.
భక్తుల ఇబ్బందులు
భారీ వర్షాలతో యాదాద్రీశుని దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులకు అవస్థలు తప్పడం లేదు. బాలాలయం చేరుకునే దారి వెంట వర్షానికి మట్టి కొట్టుకుపోవడంతో.. భక్తులు కాలి నడకన ఆలయానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
మూసీ పరవళ్లు
రాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలో వర్షం నీరు చేరింది. ఇంట్లోకి చేరిన వరద నీటిని బయటికి తోడేస్తున్నారు. స్థానిక మున్సిపల్ అధికారులు, నాయకులు ఆ ప్రాంతాల్లో పర్యటించి, వరద బాధితులను పరామర్శించారు. జిల్లాలోని మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. పోచంపల్లి మండలంలోని పోచంపల్లి - కొత్తగూడెం, జలాల్పూర్- మెహర్ నగర్ల మధ్య మూసీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
రాకపోకలకు అంతరాయం
పోచంపల్లి పట్టణ సమీపంలోని పర్రె కాల్వ పొంగటంతో సమీప గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. బీబీనగర్- పోచంపల్లి మండలాల పరిధిలో గల రుద్రవెళ్లి- జూలూరు వంతెనపై నుంచి మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిన్నఏటి వాగుకు కూడా వరద తాకిడి ఎక్కువైంది. ముగ్ధుమ్ పల్లి- గొల్లగూడెం, అనాజీపురం- రావి పహాడ్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహన దారులు నీటి ప్రవాహం కొనసాగుతున్నా వాగుపై ఉన్న వంతెనల మీదుగా ప్రమాదకరంగా దాటుతున్నారు. కొన్ని చోట్ల ఆయా గ్రామాల యువకులు ప్రజలను వాగును దాటిస్తున్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద మూసీ భారీగా ప్రవహిస్తోంది. జాలుకాల్వలో వరద నీటికి వరి పొలాలు నీట మునిగాయి.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు ఆత్మకూరు మండలంలోని బిక్కేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. భారీ ప్రవాహానికి కొరటికల్, పవ్లెపాడు, మోపిరాల, పారుపల్లి, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: KALESHWARAM: కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద... మేడిగడ్డ బ్యారేజి గేట్లు ఎత్తివేత