విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్న సమయంలో పోలీసులు హెల్మెట్, ఐడీ కార్డులు లేవని ఇబ్బందులు కల్గిస్తున్నారని… అత్యవసర సేవలందించే వారికి అట్టి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించాలని యాదాద్రి జిల్లా మోత్కూరు మండల విద్యుత్ సిబ్బంది పోలీసులను కోరారు.
లాక్డౌన్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినపుడు వినియోగదారుల నుంచి సమాచారం రాగానే విద్యుత్ సిబ్బంది వెళుతుంటారని పేర్కొన్నారు. అట్టి సమయంలో పోలీసులు హెల్మెట్, ఐడీ కార్డులు లేవని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.
ఇలా ప్రతిరోజూ పోలీసులు ప్రవర్తిస్తే తాము విధులు నిర్వర్తించలేమని విద్యుత్ సిబ్బంది తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ ఉదయ్ కిరణ్‌ను వివరణ కోరగా అత్యవసర పనులకు వెళ్లే వారిని ఆపలేదని, కరెంట్ డిపార్ట్మెంట్ పేరు చెప్పి కొందరు తిరుగుతున్నారని, అటువంటి వారిని ఆపామని ఆయన అన్నారు. కార్యక్రమంలో లైన్ ఇనిస్పెక్టర్ గొడిశాల నర్సయ్య, లైన్మెన్ ఎల్.మధు, కాటం శ్రీను, వెంకటేష్, పి.శేఖర్, ఎన్.జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఈటల కుమారుడి భూకబ్జా ఆరోపణలపై అధికారుల విచారణ షురూ