ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రిలో క్షేత్రస్థాయిలో పర్యటించారునారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో పెద్ద గుట్టపైన గల ఆలయ నగరికి చేరుకున్న సీఎం... అక్కడి నుంచి బాలాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం... సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
పనులపై ఆరా... సూచనలు...
ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ఉత్తరం వైపున పచ్చదనం కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. కొండపైనున్న ప్రత్యేక క్యూలైన్ల నిర్మాణాల్ని పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఈవో గీతారెడ్డి పనులకు సంబంధించి ముఖ్యమంత్రికి వివరించారు. యాదాద్రి ఆలయ ప్రాంగణంలో కలియదిరిగిన సీఎం... పునర్నిర్మాణాలను పరిశీలిస్తూ... సూచనలు చేశారు. గర్భాలయ తుది దశ పనులపై ఆరా తీశారు. ప్రాంగణం బయట బ్రహ్మోత్సవ మండలం, మాడ వీధుల్లోని విద్యుద్దీపాలు, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై... ఆలయ స్తపతి ఆనందాచారి వేలుకు సీఎం సూచనలు చేశారు.
తూర్పు రాజగోపురం నుంచి గర్భాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. అంతర్భాగంలో చేపట్టిన నిర్మాణాలను వీక్షించారు. మాడ వీధులు, ప్రాకార మండపంలో నిర్మించిన అద్దాల మండపం... పడమటి రాజగోపురం వద్ద వేంచేపు మండపం పరిశీలించారు. గర్భాలయ ప్రాంగణంలో ఇప్పటివరకు జరిగిన పనుల తీరును... శిల్పి ఆనంద్ సాయి, స్తపతి ఆనందాచారివేలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండ దిగువన చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. రింగ్‌రోడ్ నిర్మాణంతో పాటు ఇతర పనులు పరిశీలిస్తున్నారు.
దాదాపు పూర్తయినట్లే...
12 వందల కోట్ల రూపాయలతో ప్రారంభించిన పునర్నిర్మాణ పనులు 2016 అక్టోబరు 11న శ్రీకారం చుట్టగా... ఇప్పటివరకు సుమారు 850 కోట్లు వెచ్చించినట్లు యాడా తెలిపింది. అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో అలరారుతున్న ప్రధాన ఆలయం... 4.33 ఎకరాల్లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. మాడవీధుల్లోని సాలహారాల్లో విగ్రహాల పొందిక పనులు మినహా... ప్రధానాలయ పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. పంచలోహాలతో ప్రహ్లాద చరిత్రను చాటే పలకలను గర్భాలయ మహాద్వారంపై... జయ విజయుల శిల్పాల మందిరాలకు ఇత్తడి ప్రభలను బిగించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి... గండభేరుండ నారసింహస్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రధానాలయానికి అనుబంధంగా నిర్మిస్తున్న రామలింగేశ్వరుడి ఆలయ పునరుద్ధరణ పనులు... తుది దశకు చేరుకున్నాయి. రామానుజ కూటమిగా పిలుచుకునే వంటశాల... యాగశాల, నిత్య కల్యాణ మండపంతోపాటు అద్దాల మండపాన్ని తీర్చిదిద్దారు. ఆలయ పడమర దిశలో వేంచేపు మండపం, తూర్పున బ్రహ్మోత్సవ మండపం, ఉత్తరాన రథశాల నిర్మించారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన 13.23 ఎకరాలతో 104 కోట్లతో చేపట్టిన ప్రెసిడెన్షియల్ సూట్లలో... 15 విల్లాలకు గాను 14 పూర్తయ్యాయి. మరొకటి పురోగతిలో ఉంది. కొండ చుట్టూ 130 కోట్లతో 5.7 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బాహ్య వలయ రహదారి.. దక్షిణ దిశలో మినహాయించి మూడు వైపులా పూర్తి చేశారు. ప్రధాన ఆలయంలో విద్యుదీకరణతోపాటు ఏసీ సరఫరా, ఇతర సదుపాయాల కోసం పనులు జరగుతున్నాయి. ఇప్పటికే ఫ్లోరింగ్, డ్రైనేజీ పనులు పూర్తి కాగా... ఆలయ ఉత్తర దిశలో బస్సు ప్రాంగణం, వాహనాల పార్కింగ్ నిర్మాణం సాగుతోంది.