యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గ్రామాన్ని అంకాపూర్, ఎర్రవల్లి తరహాలో తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. గ్రామ రూపురేఖలు మార్చేందుకు 50 నుంచి 100 కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమై వాసాలమర్రిలో ఆగారు. స్థానికులతో కాసేపు ముచ్చటించిన ముఖ్యమంత్రి... కలవాలని సూచించారు. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు సీఎంను కలవగా.. రెండు గంటల పాటు వారితో చర్చించారు. అనంతరం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
కలెక్టర్‌కు ఆదేశాలు
గ్రామాభివృద్ధి కోసం ప్రజల అభిప్రాయాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో హుటాహుటిన వాసాలమర్రిని సందర్శించిన కలెక్టర్ అనితా రామచంద్రన్... కావాల్సిన సదుపాయాల గురించి స్థానికులతో చర్చించారు. గ్రామస్థుల సలహాలు, సూచనలు స్వీకరించారు. రెండు పడక గదుల ఇళ్లు, అంతర్గత రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
గ్రామస్థుల హర్షం
వాసాలమర్రిని సమష్ఠిగా అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు గ్రామవాసులు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆహ్వానించి గ్రామ సమస్యలు తీరుస్తానని హామీ ఇవ్వడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషి చేస్తామని వెల్లడించారు.
అంకాపూర్‌ను చూసి నేర్చుకోవాలి..
గ్రామాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలని అంకాపూర్‌ను చూసి నేర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వాసాలమర్రి గ్రామవాసులు అంకాపూర్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రయాణ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి