Woman With Son Washed Away in Stream Update : ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు(Road Accidents) ఎక్కువగా జరుగుతున్నాయి. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలంటే సవాలుగా మారుతోంది. రహదారులు గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కుటుంబంతో పాటు రాత్రి సమయంలో ప్రయాణించాలంటే సవాలనే చెప్పాలి. ఇటీవల ద్విచక్ర వాహనం అదుపుతప్పి వాగులో పడడంతో.. గర్భిణీ సహా మూడేళ్ల కుమారుడు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఓ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె తూర్పాటి రాజేశ్వరి (25), మనవడు సాయి ఇషాన్(3) మరణానికి కారణం అల్లుడు తూర్పాటి రమేశ్ అని మృతురాలి తల్లి పస్తరి సమ్మక్క శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నా కుమార్తె, మనవడి చావుకు అల్లుడే కారణం..: పస్తరి సమ్మక్క దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె రాజేశ్వరికి నడికుడ మండలం నర్సక్కపల్లికి చెందిన తూర్పాటి రమేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం(Extramarital Affair) పెట్టుకుని కుమార్తెను వేధిస్తుండేవాడు. రాజేశ్వరి గర్భవతి కావడంతో నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా శుక్రవారం భార్యతో పాటు కుమారుడు సాయిఇషాన్‌ను వరంగల్‌లోని సీకేఎం ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. రాత్రి 7 గంటలకు తిరిగి ఇంటికి వస్తుండగా.. మార్గం మధ్యలో పరకాల మండలం వెల్లంపెల్లి శివారులో తన ద్విచక్ర వాహనాన్ని కావాలనే వేగంగా నడిపి ఎదురుగా ఉన్న కుంటలో పడేశాడని మృతురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనలో రాజేశ్వరి, సాయిఇషాన్ మృతి చెందగా రమేశ్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అల్లుడే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పరకాల సీఐ వెంకటరత్నం తెలిపారు.
అసలేం జరిగిందంటే : హనుమకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన తూర్పాటి రమేశ్.. తన మూడేళ్ల కుమారుడిని వెంట తీసుకుని గర్భిణీగా ఉన్న తన భార్య రాజేశ్వరితో కలిసి ఈ నెల 6న ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో చీకటి పడింది. కొద్ది దూరమైతే ఇంటికి చేరతామని అనుకుంటుండగానే.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది.
Woman With Son Washed Away in Stream : ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వాగులో పడిపోయారు. రమేశ్‌కు ఈత రావడంతో అతను ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. తన భార్య, కుమారుడు వాగులో గల్లంతయ్యారని.. వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని రమేశ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం ఈతగాళ్లను తెప్పించి వాగులో గాలించారు. రాత్రిపూట కావడంతో గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. మరునాడు ఉదయం గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.