సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి ప్లాస్మా చికిత్స చేసేందుకుగాను అనుమతి లభించిన క్రమంలో దానికి ఉపయోగపడే అత్యాధునిక వైద్య పరికరాలను అందించినట్లు బాలవికాస సంస్థ డైరెక్టర్ శౌరిరెడ్డి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్లోని బాలవికాస కార్యాలయంలో వాటికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చుతో సీజీఐ అనే కార్పొరేట్ సంస్థ సహకారంతో వైద్య పరికరాలను అందజేసినట్లు చెప్పారు.
దాతల నుంచి ప్లాస్మా సేకరించిన తర్వాత భద్రపరిచేందుకుగాను 10 లక్షల రూపాయలతో మైనస్ 80 డిగ్రీల ప్లాస్మా ఫ్రీజర్, డయాలసిస్ రోగులకు కరోనా సోకితే వారికోసం ప్రత్యేకంగా సీఆర్ఆర్టీ వైద్య పరికరాలను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. సీఆర్ఆర్టీ వైద్య పరికరాలు ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో లేవని.... దీనిని తామే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చినట్లు చెప్పారు.
ఇవి కాక మరో రెండు వైద్య పరికరాలతో పాటుగా మూడు ఏసీలను కూడా అందజేసినట్లు ఆయన తెలిపారు. తమ ప్రయత్నాన్ని మంత్రి ఈటల రాజేందర్ అభినందించారని చెప్పారు.