వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలో కరోనా రెండో దశ వ్యాప్తి మొదలైంది. దీంతో గ్రామస్థులు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించుకున్నారు. కరోనా రెండవ దశ వ్యాప్తి కారణంగా గ్రామంలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఆ ఊరిలో సుమారు 40 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామస్థులందరూ ఉదయం 10 గంటల లోపే తమ పనులను ముగించుకోవాలని... ఆ తర్వాత ఎవరూ బయటకు రాకూడదని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది.
కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన వ్యక్తి మరణించగా... దహన సంస్కారాలకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో పాటుగా వేరే గ్రామాలకి చెందిన బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ కారణంగానే ఊర్లో వైరస్ విజృంభించిందని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంటింటికీ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నామని... ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.
ఇదీ చదవండి: కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని విడుదల చేయనున్న సీఎం