Robotics Design Training For Tribal Students In Warangal NIT : ఆదివాసీల జీవనం.. పట్టణాలకు కనపడనంత, వారి మాటలు పాలకులకు వినపడనంత దూరాన.. మారుమూలల్లో, కొండకోనల్లో చిక్కుకుపోయింది. ఇంకా అక్కడ పుట్టే వారి పిల్లల విద్య గురించి, వారి దుర్భర జీవితం గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరమే లేదు. అలాంటి గిరిపుత్రులకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్రోత్సాహం వరమైంది. అవకాశం వస్తే తాము ఆలోచనలకు పదును పెట్టి అద్భుతాలు సృష్టిస్తామని ఆదివాసీ విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఇంతకీ గవర్నర్ ఇచ్చిన సహకారం ఏంటీ ? ఈ ఆదివాసీల కథేంటో తెలుసుకుందాం.
రోబోలతో ఆడుతూ.. వాటి తయారీలో మెళకువలు తెలుసుకుంటున్న వీరంతా మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ విద్యార్థులు. వరంగల్ నిట్‌లో పది రోజుల నుంచి అధ్యాపకులు.. ఈ పిల్లలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిత్యం కళాశాల విద్యార్థులతో కళకళలాడే నిట్‌లో.. పాఠశాల విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కోడింగ్‌పై పట్టు తెచ్చుకుని సొంతంగా రోబోలు తయారు చేస్తూ శెభాష్ అనిపిస్తున్నారు.
"ఇంప్రూవింగ్ లాజిక్ బిల్డింగ్ స్కిల్ ఫర్ ఆదివాసీ" కార్యక్రమంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆసిఫాబాద్, అమ్రాబాద్, వైరా, తిర్యాని, జైనూరు తదితర ప్రాంతాల నుంచి తొమ్మిది, పది తరగతులు చదువుతున్న 80 మంది విద్యార్ధులను ఎంపిక చేశారు. వారికి ప్రోత్సాహం అందిస్తూ.. వారి జీవితాలకు బంగారు బాట వేస్తున్నారు.
"మాకు గవర్నర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు షెడ్యూల్ తెగలకు అదీకూడా ఆదివాసీ పిల్లలకు మీరేమైనా చేయగలరా అని గవర్నర్ అడిగారు. మేము స్టూడెంట్స్ లాజిక్ స్కిల్స్‌ను, వారు ఆలోచించే విధానం పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాము. అందుకు మేము రోబోటిక్స్ డిజైన్ అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది." - రవి కుమార్, నీట్ ప్రొఫెసర్
Robotics Design Training Programme : రోబోటిక్స్‌కు సంబంధించిన సాంకేతిక విషయాలతోపాటు, చేర్యాల చిత్రకళలోనూ విద్యార్థులు ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ఆంగ్లభాషను అనర్గళంగా మాట్లాడే విధంగా ఆచార్యులు చక్కని శిక్షణనిస్తూ.. కాన్వెంట్‌లలో చదివే పిల్లలకి ఏమాత్రం తీసుపోకుండా తీర్చిదిద్దుతున్నారు. ఈ శిక్షణ ద్వారా తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామని.. విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Robotics Design Training Programme For Tribal Students : శిక్షణ ప్రారంభించిన పది రోజుల్లోనే నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టి తమ సత్తా నిరూపించుకుంటున్నారు గిరిపుత్రులు. చిన్నతనంలోనే ఆదివాసీల జీవితాలకు సరైన మార్గాన్ని కల్పించాలన్న గవర్నర్ సంకల్పం.. దాన్ని ఆచరణలో పెట్టిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇవీ చదవండి :