Kodanda ram on singareni: సింగరేణిని ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెజస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ఈ నెల 9 నుంచి చేపట్టనున్న సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రముఖ పాత్ర పోషించారన్న ఆయన.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కదిలిరావాలని కోరారు. సమ్మెను విజయవంతం చేయాలని.. హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.
'సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 9 నుంచి కార్మికులు చేపట్టబోయే సమ్మెకు మద్దతు ఇస్తున్నాం. సమ్మెకు అన్ని వర్గాలు కలిసిరావాలి. అదే విధంగా ధాన్యం కొనుగోళ్ల అంశంపై రైతులకు మద్దతుగా ఈ 7న కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన చేపడతాం.' -కోదండ రాం, తెజస అధ్యక్షుడు
వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు నలిగిపోతున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో నెలల తరబడి జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్నదాతలకు మద్దతుగా ఈనెల 7న కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన చేపట్టబోతున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: Singareni on samme: సమ్మె వల్ల ఏమీ సాధించలేం: సింగరేణి యాజమాన్యం