Warangal Declaration: వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికగా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్... రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ డిక్లరేషన్‌ను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. భూమి ఉన్న రైతులతోపాటు కౌలుదారులకు ఏడాదికి రూ. 15 వేల పెట్టుబడి సాయం, భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు.
నూతన వ్యవసాయ విధానం: అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు... చెరుకు పరిశ్రమలు తెరిపిస్తామని రేవంత్ వివరించారు. పంటబీమా ద్వారా పరిహారం, రైతు కూలీలకు రైతుబీమా ఇస్తామన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం, ఎస్సీలు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్‌భూములకు... హక్కులు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారి ఆస్తులు జప్తు చేస్తామన్న రేవంత్... పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఎకరాదాకా నీళ్లిస్తామని తెలిపారు. రైతు కమిషన్ ఏర్పాటు చేసి... నూతన వ్యవసాయ విధానం, పంటల విధానం రూపొందిస్తామని తీర్మానించారు.
ఏళ్లు గడిచినా: తెరాస, భాజపా సర్కార్‌లు రైతుల్ని దగా చేస్తున్నాయని... కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ... ఎరువుల ధరలను రెట్టింపు అయ్యేలా చేశారని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చి ఏళ్లు గడిచినా... లక్ష రూపాయల రుణమాఫీ కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లలో తెరాస సర్కార్ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ హయాంలో వచ్చే పథకాలు రద్దు చేసి... రైతుబంధు పేరుతో ప్రజల్ని మాయచేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నో కలలతో ఏర్పాటైన తెలంగాణ... తెరాస పాలనలో అన్ని వర్గాల వారు నష్టపోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సోనియమ్మ రాజ్యం అధికారంలోకి వస్తోందని... తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: