Summer Precautions At Kakatiya Zoo Park : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. భానుడి ఉగ్రరూపానికి మాడిపోతున్నారు. ఈ ఎండ వేడిమితో మనుషులే కాదు, జంతువులు, పక్షులు కూడా విలవిలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో హన్మకొండలోని కాకతీయ జూపార్క్‌లో మూగజీవాలకు చల్లదనాన్ని అందించేందుకు యాజమాన్యం కూలర్లను ఏర్పాటు చేసింది.
Summer Arrangements At Kakatiya Zoo Park : భానుడి తాపానికి మూగజీవాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దాంతో హన్మకొండలోని కాకతీయ జూపార్క్‌లో చిరుతపులి, ఎలుగుబంటి, జింకలకు ఎన్‌క్లోజర్లలో కూలర్లను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న క్రమంలో వాటి సంరక్షణ కోసం అధికారులు ఈ రకమైన చర్యలు తీసుకున్నారు. వడదెబ్బ తగలకుండా బోన్ చుట్టూ తడకలను ఏర్పాటు చేశారు. చిరుతపులి బోన్‌ను చల్లబరిచేందుకు స్పింక్లర్స్‌ని పెట్టారు. నెమళ్లకు వేడిమి నుంచి ఉపశమనం కోసం చలువ పందిర్లు వేశారు.
పక్షులకు కొబ్బరి పీచు తడకలు : పక్షులకు వేడి తగలకుండా ఉండేందుకు ప్రతి షెడ్ పై భాగాన కొబ్బరి పీచుతో తయారు చేసిన తడకలను అమర్చారు. దానిపై గడ్డి పరిచి గంటగంటకు నీటితో తడుపుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు పక్షులు, జంతువులకు అటవీ అధికారులు ఓఆర్ఎస్ టాబ్‌లెట్స్‌ను అందిస్తున్నారు. మూగజీవాలు డీహైడ్రెట్ కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
'ఎండ తీవ్రతను తగ్గించేందుకు స్ప్రింక్లర్స్, డిప్పర్స్, కూలర్స్ దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలను మా ఉన్నతాధికారులను, డాక్టర్ల సూచనల మేరకు తీసుకుంటున్నాం. పక్షులకు, జంతువులకు ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశాం. గంటకొకసారి నీళ్లు మారుస్తూ జంతువులకు వాతావరణం చల్లగా ఉండేలా చూస్తున్నాం. పక్షులకు మా డాక్టర్‌గా ఓఆర్ఎస్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. రోజూ జంతువులను పర్యవేక్షిస్తున్నారు. అందరం కలిసి జంతువులను ఎండ తీవ్రత నుంచి కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంన్నాం.' -సంతోశ్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
సందర్శకుల ఆనందం : మరో పక్క వేసవి సెలవులు కావడంతో పార్క్‌కు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో జూని సందర్శిస్తున్నారు. జూపార్క్‌లో మూగజీవాల కోసం అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల పట్ల జంతు ప్రేమికులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: