కవులకు, కళాకారులకు పుట్టినిల్లు ఓరుగల్లు. వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన అజయ్ కుమార్ సరిగ్గా ఈ కోవకు చెందిన వాడే. 20వ ఏట స్వర్ణకారుడుగా అడుగు పెట్టిన అజయ్ కులవృత్తికి మెరుగులు దిద్దాడు. విభిన్నంగా ఏదైనా చేయాలనుకొని సూక్ష్మ కళాకృతులను సృష్టించడం ప్రారంభించాడు. మొదటగా బియ్యం గింజపై పేర్లు రాసేవాడు. అనంతరం దేశ నాయకుల ఫొటోలు చెక్కి వారికి బహుమతిగా అందించేవాడు. వీటిపై ఆసక్తి పెరిగి అగ్గిపుల్లలపై, ఏనుగు దంతాలపై శిల్పాలు చెక్కేవాడు.
గుండు సూదిపై ఛార్లి ఛాప్లిన్ చిత్రాన్ని రూపొందించాడు. అక్కడితో ఆగకుండాసూది బెజ్జంలో ఎనుగును, ఆదిమూల మహా గణపతిని, ఒంటెను చేత పట్టుకొని నడిచే వ్యక్తిని, గుర్రంపై స్వారీ చేసే యువకుడిని రూపొందించాడు. బంగారు తాళం, వేలి గొరుపై నిలుచునే ఫ్యాన్, కత్తెరతో సూదీ బెజ్జంలో రూపొందిన సత్యాగ్రహ యాత్ర లాంటివి తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు సృష్టించిన కళాకృతులకు ఐదు సార్లు లిమ్కాబుక్ ఆఫ్ రికార్టులో చోటు దక్కింది. ప్రస్తుతం గిన్నిస్ బుక్ దిశగా అడుగులు వేస్తున్నాడు అజయ్ కుమార్.
జాతిపిత మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ యాత్రను కూడా కళ్లకు కట్టినట్లు చూపించాలని... గాంధీతో పాటు మరో ఎడుగురిని సూదీ బెజ్జంలో రూపొందించాడు. మొదటి సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించేందుకు ఎనిమిది సంవత్సరాలు పడితే... కేవలం 30 గంటల్లోనే ఈ కళాఖండాన్ని తయారు చేసినట్లు చెబుతున్నాడు. ఈ కళాఖండాన్ని చూసి మంత్రముగ్ధుడైన ప్రధాని మోదీ అజయ్ ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నాడు. గాంధీ జయంతి రోజున ఈ కళాఖండాన్ని జాతికి అంకితం చేశాడు.
పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యమైంది ఏదీ లేదంటున్నాడు ఈ సూక్ష్మకళాకారుడు. అజయ్ కుమార్ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి గిన్నిస్ బుక్కులో స్థానం సంపాదించుకోవాలని మనమూ కోరుకుందాం.
ఇవీ చూడండి: సింహం సింగిల్గానే వస్తుంది: లక్ష్మణ్