వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ నుంచి ధర్మసాగర్ వైపునకు ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోలింగ్ తర్వాత.. డాంబర్ మందం రోడ్డుకు ఒక ఇంచుకు పైగా ఉండాలని, కానీ అరఇంచు మాత్రమే ఉండటం గమనించిన గ్రామస్థులు గుత్తేదారుని నిలదీశారు.
నిబంధనల ప్రకారం నాణ్యమైన రోడ్డు వేయకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగా.. గుత్తేదారు వారితో దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్థులు తెలిపారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడని వెల్లడించారు.
గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మడికొండ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని సంఘటనాస్థలికి చేరుకున్న ఆర్అండ్బీ జేఈ రోడ్డును పరిశీలించారు. తక్కువ మందం ఉన్న చోట మళ్లీ డాంబర్ వేసేలా చర్యలు తీసుకున్నారు. నాణ్యతతో రహదారి నిర్మాణం జరగాలని గుత్తేదారుని ఆదేశించారు.
- ఇవీ చూడండి: అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహిస్తాం: ఉత్తమ్