Lorries Shortage and Paddy Procurement Problems In Hanamkonda : కష్టపడి అధిక పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యాన్ని అమ్ముకోడానికి రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. పంటని కొంటున్నారు, కొన్నవి తీసుకపోతలేరు అని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో కనీసం తూకాలు వేయడం లేదు. ప్రతి గింజ కొంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం... కానీ కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రం సర్కార్ చెప్పినదానికి భిన్నంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.
Paddy Procurement Problems : హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి తూకాలు కాక ఎదురుచూస్తున్నారు. లారీల కొరత వల్లే జాప్యం జరుగుతుందంటూ కొనుగోలుదారులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పరకాల, శాయంపేటతో పాటు పలు మండలాల్లో ధాన్యం తడిసింది. అయినప్పటికి రైతులు ధాన్యాన్ని ఆరపెట్టుకొని కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయి. అధికారుల అలసత్వం, నిర్వహణ కేంద్రాల జాప్యంతో ప్రారంభించి నెలలు గడుస్తున్న కనీసం ఒక్క లారీ కూడా ఎగుమతి కానీ సెంటర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్షం వస్తే పరిస్థితి ఏంటి అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Paddy Procurement Frauds in TS : మిల్లర్ల మాయాజాలం.. అన్నదాతలు ఆగమాగం
శాయంపేట మండలంలోని కొన్ని చోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారని చూసి వేసారిన రైతులు పక్క సెంటర్ల నుంచి గన్ని సంచులు తీసుకువచ్చి ధాన్యాన్ని అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ఒకవేళ మళ్లీ వర్షం వస్తే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
మళ్లీ వర్షం పడితే మా పరిస్థితి ఏంటి: కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చాలా చోట్ల నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి వల్ల కాంటాలు సరిగా కావడం లేదంటూ రైతులు చెబుతున్నారు. శాయంపేట మండలం పెద్దకోడపాక గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన కిరణ్ అనే రైతు ధాన్యం బస్తాలు నీటిలో పూర్తిగా తడిసిపోయాయి. కష్టపడి వేరే చోటికి మార్చుకున్న రైతు ధాన్యం ఆరింది. మళ్లీ వర్షం వస్తే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇలాగే చాలామంది పరిస్థితి ఉందని త్వరితగతిన కాంటాలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు.
ప్రధానంగా లారీల కొరత వల్లే కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం లారీల కొరత లేకుండా చర్యలు చేపడితే ధాన్యం త్వరితగతిన కాంటాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులు స్పందించి కాంటాలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, లారీల కొరత లేకుండా చూడాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: