Inavolu Mallanna Swamy Brahmotsavalu : రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ముచ్చటైన స్వాగత తోరణాలు, అద్భుతమైన శిల్ప సంపదతో ప్రకృతి రమణీయతను పంచే ఆలయం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. వందల ఏళ్ల క్రితం నిర్మితమైన ఆలయంలో ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ సహా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
Inavolu Mallanna Swamy Jathara Start Jan 13th : ఈనెల 13న సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, 14, 15 బండ్లు తిరుగుట, 16న మహా సంప్రోక్ష సమారాధన జరగనుంది. ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహించనున్నారు. మార్చి 9నుంచి 13వరకు శివరాత్రి కల్యాణోత్సవాలు, ఏప్రిల్ 13న ఉగాది కార్యక్రమాలతో ముగుస్తాయని ఆలయ ప్రధానార్చకులు వెల్లడించారు.
ఐనవోలు మల్లన్న జాతర ఘనంగా నిర్వహిస్తాం : మంత్రి కొండా సురేఖ
'మకర సంక్రాంతి పండుగ రోజు మనకు బాగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న గ్రామల రైతులు ఎడ్ల బండ్లతో ప్రభలను నిర్వహించి, వారి భక్తిని చాటుకుంటారు. అలాగే ఈ ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా కూడా ఐదు రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలుంటాయి. ఉగాది ముందు వచ్చే ఆకరి ఆదివారం కూడా స్వామివారికి సుమారు 50 అడుగుల విస్తీర్ణంతో పెద్ద పట్నం కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే స్వామివారికి కల్యాణం కూడా జరుగుతుంది.' -రవీందర్ శర్మ, ప్రధాన అర్చకులు, ఐనవోలు ఆలయం
ఐనవోలు మల్లన్న జాతర డ్రోన్ విజువల్స్ మీరెప్పుడైనా చూశారా
Inavolu Jatara in Telangana 2024 : ఈ ఏడాది ఆదివాసీ కుంభమేళా అయిన మేడారం జాతర(Medaram Jatara 2024) ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అదనపు క్యూలైన్లు, తాగునీరు, చలవ పందిళ్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
'భక్తులు గతంలో కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నాం. అంటే సుమారు 9 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారని అనుకుంటున్నాం. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా మహమ్మరి మళ్లీ వస్తుండడంతో దానిని దృష్టిలో పెట్టుకొని దేవాదాయ అధికారుల ఆదేశాల మేరకు ఒక్కొక్కరుగా వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు కరోనా భయం లేకుండా స్వామివారిని దర్శించుకునేలా సిద్ధం చేస్తున్నాం.' -నాగేశ్వర్రావు, కార్య నిర్వాహణ అధికారి, ఐనవోలు ఆలయం