వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట డివిజన్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పిరియాడికల్ ఓవరాలింగ్ పరిశ్రమ నిర్మాణ స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి సేకరించినట్లు తెలిపారు.
దీనికి సంబంధించి దేవాదాయ శాఖకు, ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించి 106 ఎకరాల భూమిని రైల్వేశాఖకు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మరో 50 ఎకరాల ఆలయ భూమిని కూడా అదనంగా సేకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇక్కడ నిర్మించాల్సిన కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రాలకు తరలిపోయిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చొరవతో పీఓహెచ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు.
రైల్వే పిరియాడికల్ ఓవరాలింగ్ పరిశ్రమ ద్వారా ఇక్కడ యువతకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నగరంలో దుకాణదారుల స్వచ్ఛంద లాక్డౌన్