త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నిక కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే ఎన్నిక అని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్(eetela rajender) అన్నారు. నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయంలో(kakatiya university) పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన మహాదీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో 2023లో ఈ ప్రభుత్వాన్ని కూల్చే రిహార్సల్ ఎన్నిక అని వ్యాఖ్యానించారు. దళితుల ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. దళితబంధు కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓట్ల కోసమే తెచ్చారే తప్పా.. దళితుల బతుకులు బాగుపడాలనే ఉద్దేశంతో కాదన్నారు.
రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునే ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. ఉన్నోళ్లకు డీమ్డ్ వర్సీటీలు ఉన్నాయని.. మరీ పేద విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలాయల్లో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఎలా గెలవాలో అనే ఆలోచనే తప్పా.. విద్యార్థులకు మంచి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలు పూర్తిగా నిర్వీర్యంగా మారాయన్నారు. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకులను నియమించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈటల డిమాండ్ చేశారు. విద్యార్థులు చేసే న్యాయపోరాటాలకు మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు.
హుజూరాబాద్‌లో దళితుల ఓట్లు కొల్లగొట్టేందుకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మిమ్మల్ని మరోసారి మోసం చేసేందుకు దళితబంధును తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టంతా హుజూరాబాద్‌లో గెలవడమే. ఆయన ప్రేమ దళితులపై కాదు. కేవలం హుజూరాబాద్ ఓట్లపైనే ఆయనకు ప్రేమ. నిజంగా దళితుల బతుకులు బాగుపడాలనే ఉద్దేశం వారికి లేదు. రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో కనీసం బోధించేందుకు ప్రొఫెసర్లు లేరు. ఉన్నవాళ్లకేమో డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ పేద విద్యార్థులకు కదా కావాల్సింది చదువు, ఉద్యోగాలు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలన్నీ ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలి. మాలాంటి వాళ్లు ఎక్కడున్నా ధర్మం, న్యాయం కోసమే మా ఎజెండా. హుజూరాబాద్ ఎన్నిక కేసీఆర్ అహంకారానికి బొందపెట్టే ఎన్నిక. 2023 ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఎన్నిక. - ఈటల రాజేందర్, మాజీ మంత్రి
ఇదీ చూడండి: Etela: 'హుజూరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం'