కరోనా మహమ్మారి కారణంగా మరోసారి ప్రైవేటు పాఠశాలల మూసివేత... యాజమాన్యాలు... ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యాసంస్థలు మూసివేయడం పై.. యాజమాన్యాలు హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టాయి. కొన్ని గురుకులాల్లో కరోనా వచ్చిందనే సాకుతో.. 40 వేల పాఠశాలలను మూసివేయడంపై సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు.. విచ్చల విడిగా నడుస్తున్నాయని... కేవలం బడుల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చకుంటే 31 నుంచి... నిరాహారదీక్ష చేస్తామని వారు హెచ్చరించారు.
విద్యాసంస్థలు తెరవాలని నినాదాలు
విద్యాసంస్థల మూసివేతపై సాంకేతిక విద్యా కళాశాలల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యాసంస్థలు తెరవాలని నినదించారు. హన్మకొండ, వరంగల్‌లో ప్లకార్డులతో ధర్నా చేపట్టిన ప్రైవేటు టీచర్లు ప్రభుత్వం ఆర్థిక భృతి కల్పించాలని కోరారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరినీ సంప్రదించకుండా.. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని. బార్లకు,థియేటర్లకు లేని పరిమితులు.. విద్యాసంస్థలెందుకని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. కరోనా కారణంగా జీతాల్లేక రోడ్డున పడుతున్నామని తక్షణమే పాఠశాలలు తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
కరోనాను సాకుగా చెప్పారంటూ..
కరీంనగర్ జిల్లా మానకొండూరులో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలవగానే కరోనా పంజా అంటూ మూసివేయడం సమంజసం కాదంటూ... మహబూబ్‌నగర్‌లో విద్యార్థి సంఘాలు ఆక్షేపించాయి.
ఆవేదన అర్థం చేసుకోండి..
తాత్కాలికంగా మూసివేత అంటూ ప్రభుత్వం చెపుతోందని...అది ఎప్పటివరకో వెంటనే తెలియచేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తమ ఆవేదన అర్థం చేసుకుని విద్యాసంస్ధలు తెరవకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం