స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్థత వల్లే వరంగల్ నగరానికి వరద దుస్థితి వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హన్మకొండలోని పలు ముంపు ప్రాంతాలను, జలమయమైన కాలనీలను స్థానిక భాజపా శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. వరద ప్రవాహానికి దెబ్బతిన్న ప్రధాన రహదారులను పరిశీలించారు. నగరంలో సరైన డ్రైనేజీలు, నాలాల పై ఆక్రమించి కట్టిన ఇళ్ల వల్లే వరద నీటితో నగరం జలదిగ్బంధం అయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని... కేంద్రం ఇచ్చిన స్మార్ట్ నిధులను దుర్వినియోగం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు.
రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలో గత 3 రోజుల నుంచి వరద ప్రవాహం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. నగరానికి వస్తున్న నిధులను మింగేస్తున్నారని విమర్శించారు.
ఇవీ చూడండి: 'నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం'