తెరాస, భాజపా మధ్య.. అయోధ్య రామాలయ నిధి సేకరణ.. వివాదాన్ని రాజేస్తోంది. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తల దాడుల నేపథ్యంలో.. వరంగల్‌లో అరెస్టులపర్వం కొనసాగుతోంది. నగరంలోని హంటర్ రోడ్ లో తెరాస కార్యకర్తలు దాడి చేసిన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి నాయకులను పరామర్శించేందుకు.. పలువురు నేతలు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వస్తుండగా వారిని మార్గం మధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ఘట్కేసర్ వద్ద.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఆలేరు వద్ద పోలీసులు నిలిపి దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నేతల అరెస్ట్
ఇతర నేతలను జనగామ జిల్లా లింగాలఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా... అమరవీరుల స్థూపం వరకూ ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ... రాకేష్ రెడ్డి, కొండేటి శ్రీధర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడిలో పాల్గొనందుకు... మొత్తం 44 మంది భాజపా నాయకులు... కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి వారికి 14 రోజులు రిమాండ్ విధించారు.
చర్చకు కేటీఆర్ సిద్ధమా
సిద్దిపేటలోని పాతబస్టాండ్ వద్ద.. భాజపా శ్రేణులు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. తెరాస నేతలను రెచ్చిపోమ్మని మంత్రి కేటీఆరే ప్రోత్సహిస్తున్నారని.. భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్‌లో ఆరోపించారు. రామమందిరం కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిధులు ఇస్తున్నారని.. నిధి సేకరణపై భద్రాద్రి గుడి వద్ద చర్చకు కేటీఆర్ సిద్ధమా అని... రఘునందన్ రావు సవాల్ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెరాస ఆగ్రహం...
చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి చేయడం సిగ్గుచేటని.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని... మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన... వరంగల్ అంటేనే పోరుగడ్డ అని, మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు. భాజపా కార్యకర్తలు వీధిరౌడిల్లా వ్యవహరిస్తున్నారని.. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఖమ్మంలో ఆరోపించారు.
ఇదీ చదవండి: విన్నపాలు బుట్టదాఖలు.. రాష్ట్రాన్ని నిరుత్సాహపరిచిన కేంద్ర బడ్జెట్