కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ సాధనే లక్ష్యంగా ఏర్పడిన సాధన సమితి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి మొదలైన ఈ ర్యాలీ వరంగల్ రైల్వే స్టేషన్ వరకు సాగింది. అఖిలపక్షంతో పాటుగా పలు ప్రజా సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.
కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ వాసుల చిరకాల కోరిక అని... దానిని సాధించే వరకు విశ్రమించేది లేదని నాయకులు నినాదాలు చేశారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఏప్రిల్ 5న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు మద్దతుగా ఈ ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి వ్యవస్థాపకులు గాదె ఇన్నారెడ్డి, కర్ర యాదవరెడ్డి, దేవులపల్లి రాఘవేందర్లు జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతుల వల్లే ఆర్థిక వ్యవస్థ కొంతైనా నిలబడగలిగింది: ఉపరాష్ట్రపతి