రాష్ట్ర చేనేత జౌళీ శాఖ రామప్ప కాటన్ పేరుతో కొత్త రకం చీరలు అందుబాటులోకి తేనున్నాయి. ఇందుకు వరంగల్ ప్రాంత చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చింది. రామప్ప కాటన్ పేరుతో మరో వైవిధ్య వస్త్రం ముందుకు రానుంది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో నేతన్నలు కొత్తగా హిమ్రూ అనే పేరుతో దుస్తులను తయారు చేస్తున్నారు. వీటి తయారీపై ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చింది. చేనేత వస్త్రాలకు పేరు గాంచిన తెలంగాణ నుంచి ‘రామప్ప కాటన్’ పేరుతో మరో వైవిధ్య వస్త్ర విశేషం ఉత్పత్తి కానుంది. దీనికి వరంగల్ వేదిక కానుంది. ఇప్పటికే విజయవాడలోని వీవర్స్ సర్వీస్ సెంటర్లో రామప్ప కాటన్‌కు సంబంధించి ఆకట్టుకునే పలు ఆకృతులను సిద్ధం చేశారు.
ఉత్పత్తి మార్పుపై నేతన్నలకు అవగాహన
రాష్ట్ర విభజనకు ముందు ఏటా ఈ తివాచీలు 13 లక్షల వరకు ఉత్పత్తి అయ్యేవి. వాటిని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో అందించడంతో నేతన్నలకు ఉపాధి లభించేది. ఇటీవల తివాచీలకు గిరాకీ లేకపోవడంతో చేనేతలకు ఉపాధి కరవై కూలీలుగా మారుతున్నారు. ఈ క్రమంలో చేనేత జౌళి శాఖ సంచాలకురాలు శైలజా రామయ్యర్ ఇక్కడ ఉత్పత్తి మార్పు (ప్రాడక్ట్ డైవర్సిఫికేషన్) అవసరమని భావించారు. చీరలు, డ్రెస్ మెటీరియళ్లు, ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ ఉన్న దుస్తులు నేస్తేనే చేనేతలకు ఉపాధి ఉంటుందని భావించి ఉత్పత్తి మార్పుపై నేతన్నలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే కాకతీయ శిల్ప సంపదను ప్రతిబింబించేలా చీరలు, ఇతర దుస్తులపై డిజైన్లు వేయాలని తలచి స్థానిక చేనేత జౌళి అధికారుల సహకారంతో కొత్త డిజైన్లను అభివృద్ధి చేశారు. దీనికి ‘రామప్ప కాటన్’ అని నామకరణం చేశారు.
‘హిమ్రూ’ ప్రారంభం
హిమ్రూ మగ్గాలను ధర్మవరం నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఉత్పత్తి మార్పులో భాగంగా చీరలతో పాటు మరికొన్ని రకాల దుస్తులు రూపొందించేందుకు ఇప్పటికే పలు చేనేత సంఘాలకు శిక్షణ పూర్తయ్యింది. ఇప్పటి వరకు తివాచీలు, తువ్వాళ్లు మాత్రమే నేసే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సొసైటీలో నేతన్నలు తాజాగా ‘హిమ్రూ’ అనే దుస్తులను తయారు చేస్తున్నారు. ఇది ఒకప్పుడు నిజాం నవాబులు ధరించిన కోటు నమూనాగా ఉంటుంది. ఈ దుస్తులను ‘టెస్కో’ మార్కెటింగ్ చేయనుంది. హిమ్రూ కోటు డిజైన్లతో త్వరలో శంషాబాద్ విమానాశ్రయంలో స్టాల్ ఏర్పాటు చేసేందుకు టెస్కో ఏర్పాట్లు చేస్తోందని కమలాపూర్ క్షేత్ర జౌళి అధికారి ఎస్.రవీంద్ర తెలిపారు. కొత్త ఉత్పత్తిలో నైపుణ్యం సాధించడం వల్ల నేతన్నలు మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుందన్నారు.
ఇదీ చూడండి : శివరాత్రి సందర్భంగా లక్ష్మీ పంపుహౌస్ 11 మోటర్లు ప్రారంభం