రాష్ట్రంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పాఠశాలలు, కళాశాలలకు తాత్కాలికంగా సెలవు ప్రకటించింది. డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేసింది. ఈ క్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, వసతి గృహాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో ఆయా యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నారు.
మేం ఇంటికెళ్లం..
కరోనా వల్ల తాము చదువులో వెనుకబడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న వారు.. అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాల్లో అయితే.. సమయానికి భోజనం, స్టడీ అవర్స్, ప్రత్యక్ష తరగతులు ఉంటాయని, ఇంటికి వెళ్తే ఇవేవీ ఉండవని పేద విద్యార్థులు అంటున్నారు. కరోనా తమ భవిష్యత్‌ను గందరగోళానికి గురిచేస్తోందని ఆందోళన చెందుతున్నారు.
అక్కడుంటేనే బెటర్..
మరోవైపు ఈ మహమ్మారి తమ పిల్లలకు శాపంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదే.. పదే సెలవులు ఇవ్వడం వల్ల తమ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారని అంటున్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో కొవిడ్ నిబంధనలు కఠినంగా పాటిస్తే వారిని అక్కడే ఉంచి చదివిస్తామని స్పష్టం చేశారు. ఆ దిశగా అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
మాకిష్టం లేదు..
పిల్లలను వసతి గృహాల నుంచి ఇంటికి పంపడం ఇష్టంలేదని అధ్యాపకులు అంటున్నారు. ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా పంపాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. సెలవుల దృష్ట్యా ఇంటికెవెళ్లే విద్యార్థులకు హోమ్ వర్క్.. ఇతర జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నామని తెలిపారు. కరోనా నియమాలు పాటించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.
- ఇదీ చదవండి : కోలుకున్నవారిలో కొన్నేళ్ల వరకు యాంటీబాడీలు!