రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో రెండు, మూడుసార్లు పెట్టిన పత్తి గింజలు మొలవనే లేదు. మొక్కలు మొలిచినా సరిగా పెరగలేదు. ఆగస్టు నుంచి కురిసిన వర్షాలకు పత్తి కళకళలాడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణమూ పెరిగింది. అంతా సజావుగా సాగుతూ... పంట చేతికొచ్చే దశలో వారంరోజులుగా కురుస్తున్న వాన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
మురిగిపోతున్న పత్తి...
ఉదయమంతా ఎండగా ఉన్నా... పొద్దుపోయేసరికి ఉరుములతో కూడిన వర్షం వస్తోంది. ఈ వానల ధాటికి పత్తికాయలు మురిగి పోతున్నాయి. మరికొన్నిచోట్ల పొలాల్లో నీరు చేరి పంట పూర్తిగా కుళ్లిపోతోంది. వరంగల్ గ్రామీణం, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో దాదాపు అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంత శ్రమపడినా రైతుకు కనీసం పెట్టుబడి కూడా రావటం లేదు.
మొక్కజొన్నది అదే పరిస్థితి...
జిల్లాలో మొక్కజొన్న ఈసారి మంచి దిగుబడులను ఇచ్చింది. మక్క రైతులు ఆనందంగా వాటిని సొమ్ము చేసుకునే సమయంలో వర్షం వారిని దుఖంలోకి నెట్టివేసింది. పంటను కాపాడుకునే సమయం కూడా అన్నదాతలకు ఇవ్వడం లేదు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఆరేసిన మక్కలు వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే వాటిని కాపాడుకోలేకపోయిన ఆ అన్నదాతల పరిస్థితి వర్ణనాతీతం.
పంట దిగుబడి బాగుందని మురిసిన రైతన్నలకు వర్షాలు తీవ్ర వేదనను మిగిల్చాయి. తడిసిన గింజలు, తేమతో కూడిన పత్తితో తమకు గిట్టుబాటు ధర ఎలా వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని... లేకుంటే చావే శరణ్యమని కర్షకులు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన