వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట బావి హత్యల ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. నిందితుడు సంజయ్ కుమార్‌ను సోమవారం గీసుకొండ మండలం జాన్‌పాక్‌లోని తన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ రాష్ట్రం బిగుసరై జిల్లా నుర్లపూర్కు చెందిన ఇతని వయసు మాత్రం 24 ఏళ్లే. వయసు చిన్నదే కానీ.. అన్నీ చావు తెలివితేటలే. మానవత్వం మరచిపోయి పదిమందిని నిర్ధాక్షిణ్యంగా చంపాడు. అయితే ఈ రాక్షసుడిని పోలీసులు 72 గంటల్లో పట్టుకొని వాళ్లేంటో నిరూపించారు.
6 బృందాలు.. 72 గంటలు..
9 మంది మృతదేహాలు బావిలో లభ్యమైన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు ముమ్మర విచారణ చేపట్టారు. మొత్తంగా 6 ప్రత్యేక బృందాలతో 72 గంటలపాటు రాత్రింబవళ్లు శ్రమించి.. కేసును ఛేదించారు. ఈ కేసు దర్యాప్తు కోసం 100 మంది సిబ్బంది పనిచేశారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ప్రత్యేక బృందం, క్లూస్ టీం, సాంకేతిక బృందం, స్థానిక పోలీసులు అందరూ సమన్వయంతో పనిచేశారు.
పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ, కాల్ డేటా
మక్సూద్ కుటుంబంతో ఉన్న పరిచయస్తులను పోలీసులు ప్రశ్నించారు. గోదాం వద్ద, మృతుల నివాసం వద్ద ఉండే వారిని గమనించారు. అనుమానితుల వివరాలు సేకరించారు. సెల్‌ఫోన్ కాల్ డేటా ఈ విచారణలో బాగా ఉపయోగపడింది. అన్నింటికి మించి సీసీ ఫుటేజీ దృశ్యాలు నిందితున్ని పట్టించాయి. మక్సూద్, బిహారీలు ఉండే గదిలో దొరికిన వస్తువులపై పోలీసులు వేలిముద్రలు తీసుకొన్నారు. నిందితుడి వేలిముద్రలతో సరిపోయాయాన్నదీ పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్ష్యాలు ఇచ్చిన సమాచారం పోలీసులకు ఎంతో ఉపయోగపడింది.
విస్తృత విచారణ
ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా ముమ్మర శోధన చేయడం వల్ల ఫలితం కనిపించింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్... పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ కేసులో వైద్య ఆధారాలు కూడా కీలకంగా మారాయి. నీటిలో పడి చనిపోయారని.. శరీరాలపై ఈడ్చుకుపోయిన గాయాలున్నాయని.. పోస్టుమార్టం చేశాక ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా తేల్చారు. ఈ విషయం కూడా పోలీసుల దర్యాప్తునకు బాగా ఉపయోగపడింది. పోలీసు సిబ్బంది అంతా.. సవాల్‌గా తీసుకొని దర్యాప్తు చేయడం వల్ల మూడే రోజుల్లో కేసును ఛేదించారు.
ఇదీ చూడండి: భారత్, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు