ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారుల చర్యలతో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు. మొదటగా వరంగల్ అర్బన్ జిల్లాలో మర్కజ్ వెళ్లి వచ్చిన 25 మందికి వైరస్ సోకింది. ములుగు, జనగామ జిల్లాలో రెండేసి పాజిటవ్ కేసులు రాగా.. భూపాలపల్లి జిల్లాలో మూడు, ములుగు జిల్లాలో ఒక కేసు నమోదయింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎక్కడైతే కేసులు వచ్చాయో ఆయా ప్రాంతాలను నో మూమెంట్ జోన్లుగా ప్రకటించారు. బారికేడ్లు పెట్టి ఎవరినీ లోపల నుంచి బయటకు.. బయట నుంచి లోపలికి అనుమతించలేదు. అన్ని చోట్ల సోడియం హైపో క్లోరైట్ స్ప్రే, నిత్యావసరాలు, కూరగాయలు ఇంటికే సరఫరా, ఆశా, ఏఎన్ఎంలతో ఇంటింటి సర్వే చేయడం వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయి.
ప్రతి రోజూ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మిగిలిన జిల్లాలో కలెక్టర్లు ఇదే రీతిన నిరంతర నిఘా పెట్టడం వల్ల వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
హాట్‌స్పాట్ జిల్లాగా ఉన్న వరంగల్ అర్బన్‌లో బాధితులు త్వరగానే కోలుకుంటున్నారు. ఇప్పటివరకు ఏడుగురు డిశ్చార్జి కాగా.. మరో 18 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు పాజిటివ్ వ్యక్తులు కోలుకుని డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొత్త కేసులు రాకపోవడం ఊరట కలిగించే అంశం.
ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య