No Sanitation in The Municipalities: రాష్ట్రంలోని పురపాలికల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధాన ప్రాంతాలపై పాలకవర్గాలు దృష్టి సారిస్తున్నా.. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. వారం, రెండు వారాలకోసారి మురుగునీటి కాలువల శుద్ధి, రెండు, మూడు రోజుకోసారి చెత్త తరలింపు, చాలీచాలని సిబ్బంది, వాహనాల కొరత, డంపింగ్‌యార్డు సమస్యలు.. రహదారులపై, వీధుల్లో దుకాణాలు, హోటళ్ల వ్యర్థాలు.. పలు పట్టణాలు, నగరాల్లో ఇదీ పరిస్థితి. పరిశుభ్రతపై ప్రభుత్వం ఏటా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ సమయంలో పరిస్థితి బాగానే ఉంటున్నా.. ఆ తర్వాత మళ్లీ మొదటికొస్తోంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యధిక నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల మాట అటుంచితే.. కనీసం చెత్త సేకరణ సక్రమంగా సాగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సిబ్బంది కొరత.. ఉదాసీనత
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో విలీన కాలనీల విస్తీర్ణం ఎక్కువ. డ్రైనేజీలను శుభ్రం చేయాలంటే 15-30 రోజుల సమయం పడుతోంది. పారిశుద్ధ్య పరిస్థితిపై తీగలగుట్టపల్లి, సీతారాంపూర్, పద్మానగర్, సదాశివపల్లి-హౌసింగ్‌బోర్డు కాలనీ ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు సర్వసాధారణంగా మారాయి. ప్రధాన రహదారులను ఊడ్చే మిషన్లలో ఒకటి పాడవగా.. మిగిలిన రెండు సరిపోవడం లేదు. ఖమ్మంలో తగినంత మంది కార్మికులు లేరు. మరో వంద మంది అవసరమని అంచనా. సూర్యాపేటలోనూ కార్మికుల కొరత ఉంది. స్థానికులు ఇష్టారాజ్యంగా చెత్త వేస్తుండటంతో సేకరణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జగిత్యాలలో అవసరం మేరకు కార్మికులు, వాహనాలు లేక చెత్త సేకరణ, రహదారుల శుభ్రత, మురుగుకాల్వల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. 52 ఆటోలు, 12 ట్రాక్టర్లు మాత్రమే ఉండటంతో వీధుల్లో నాలుగైదు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. 324 మంది కార్మికులున్నారు. మరో 40 మంది అవసరం. అయిజలో కార్మికులు, వాహనాల కొరతతో రెండు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. వడ్డేపల్లి, మక్తల్‌లలోనూ కార్మికుల కొరత, వాహనాల సమస్య ఉంది. కొత్తకోటలో 35 మంది కార్మికులే ఉన్నారు. జహీరాబాద్‌లో అవసరమైన కార్మికుల సంఖ్యలో సగం మందే ఉన్నారు. 14 వేల జనాభా ఉన్న భూత్పూర్‌లో చెత్త తరలించేందుకు ఒక్క వాహనమే ఉంది.
చెత్త దిబ్బలుగా ఖాళీ స్థలాలు
భూపాలపల్లిలో ఖాళీ స్థలాలు మురికి కూపాలుగా.. కుక్కలు, పందులు, విష పురుగులకు ఆవాసాలుగా మారాయి. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి, మురుగునీరు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు ప్రబలుతున్నాయి. రెడ్డికాలనీ, రాంనగర్, హన్‌మాన్‌నగర్, ఎల్బీనగర్, లక్ష్మీనగర్ తదితర కాలనీల్లో నిర్లక్ష్యంగా వదిలేసిన ఖాళీ ప్లాట్లున్నాయి. పలు కార్మిక కాలనీల్లో మురుగు కాలువలు లేవు. కార్మికులు, వాహనాల కొరతతో పట్టణంలో వారానికోరోజు మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు.
హుజూరాబాద్ విలీన గ్రామాల్లో చెత్త సేకరించడం లేదు. డ్రైనేజీలు లేవు. పారిశుద్ధ్య కార్మికులు సరిపోవడం లేదు. డంపింగ్ యార్డు నిర్మాణంలో ఉండగా.. ప్రధాన రహదారుల పక్కనే చెత్త వేస్తున్నారు. మిర్యాలగూడలో ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్నారు. ఆదిలాబాద్‌లోని విలీన గ్రామాల్లో సక్రమంగా చెత్త సేకరించక వీధులు, రోడ్లపైనే పేరుకుంటోంది.
ఇదీ చూడండి: AP Lorries Seized: కొవిడ్ దెబ్బకు ఏపీలో 30వేల లారీల సీజ్