రైతులు పండించిన ప్రతి పంటనూ ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని భాగ్యలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపెడుతూ.. పండించిన పంటల కొనుగోలులో కొర్రీలు పెడుతుందని మంత్రి విమర్శించారు. రాష్ట్ర సంక్షేమ పథకాల్లో అధిక నిధులు ఇస్తున్నట్టు గొప్పలు చూపుతుందని, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. భాజపా పాలిత ప్రాంతాల్లో మాత్రమే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయిస్తూ, తెలంగాణ ప్రాంతాన్ని విస్మరిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకొని.. మద్దతు ధర పొందాలని సూచించారు.