Maize Crop Price in Narsapur Market : ఆరుగాలం చెమటోడ్చి మొక్కజొన్నలు పండించిన రైతులు. వాటిని మార్కెట్‌లో అమ్మే సమయానికి గిట్టుబాటు ధర లభించక నీరుగారిపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, సాగు వ్యయం, కూలీల ఖర్చులు తడిసి మోపెడైనా. లాభం రాకపోతుందా అన్న ఆశతో పంటను మార్కెట్‌కు తరలించిన రైతులు పడిపోయిన ధరలతో దిగాలుగా నేలచూపులు చూస్తున్నారు. మార్కెట్ యార్డులో కళ్లముందే జొన్నల రాశులు కళకళ లాడుతున్నా.. ఆశలు ఆవిరైపోతున్న మొక్కజొన్న రైతుల దుస్థితిపై కథనం.
వచ్చిన మొత్తంతో అప్పులు కూడా కట్టలేం: వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్నల ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. సీజన్ ప్రారంభంలో క్వింటాకు పలికిన రూ.2400 ధర. ప్రస్తుతం రూ.1830కు పడిపోయింది. దీంతో మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం క్రితం నర్సంపేట మార్కెట్‌కు 7 వేల బస్తాల మొక్కజొన్నలు వచ్చాయి. ఒక్కసారిగా ధర తగ్గించిన ట్రేడర్లు. వాటిని క్వింటాకు రూ.1830 నుంచి రూ.1700 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
Corn Crop Price in Narsapur Market : వ్యాపారుల వైఖరితో గంపెడాశతో మొక్కజొన్న బస్తాలు మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారయింది. ఈ ధరలకు పంటను అమ్ముకుంటే పంట కోసం చేసిన అప్పులు కూడా కట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, తగ్గిన ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి, మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.
మొక్కజొన్న స్థానంలో నూకలు: మొక్కజొన్న ధర తగ్గడానికి పౌల్ట్రీ పరిశ్రమలే కారణమంటున్నారు ట్రేడర్లు. ఇదివరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కోళ్ల ఫారాల యజమానులు కొనుగోలు చేసేవారు. ఒక్క హైదరాబాద్ శివార్లలోనే కోళ్ల పరిశ్రమలు లక్షా 50 వేల టన్నులు కొనుగోలు చేసేవి. అయితే, నూకలు కింటాకు రూ.1900లకే లభిస్తుండటంతో పౌల్ట్రీ యజమానులు జొన్నలకు బదులుగా నూకలనే కోళ్ల దాణాగా వాడుతున్నారు. దీంతో విధిలేక ధరలు తగ్గించి అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు తగ్గుముఖం పట్టాయని అంటున్నారు. స్థానిక వినియోగం, విదేశాలకు ఎగుమతులు కూడా భారీగా తగ్గాయని, రానున్న రోజుల్లో ధరలు మరింతగా పడిపోయే అవకాశముందని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు.
ఇవీ చదవండి: