ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులు తదిత సౌకర్యాలు ఉండటం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు ఇష్టపడుతుంటారు. పేద, ధనిక తేడా లేకుండా పిల్లల్లో అసమానతలకు తావివ్వకుండా ఏటా పాఠశాలల్లోనే ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో దుస్తులు అందలేదు. గతంలో కుట్టిన దుస్తులను ఇచ్చేవారు. కొలతల్లో తేడాలతో విద్యార్థులకు అవి ఎబ్బెట్టుగా ఉంటున్నాయని, కొలతలకు అనుగుణంగా కుట్టించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే వస్త్రం సరఫరా, దుస్తుల కుట్టించడంలో ఆలస్యం అవుతోంది. ఫలితంగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
సకాలంలో రాకపోడంతో..
ప్రభుత్వమే టెస్కో నుంచి వస్త్రాన్ని సరఫరా చేస్తోంది. రెండు జతలకు కుట్టేందుకు రూ. 100 చొప్పున చెల్లిస్తోంది. వస్త్రమే ఆలస్యంగా రావడం వల్ల కుట్టు పనుల్లోనూ జాప్యం అవుతోంది. వేసవి సెలవుల్లోనే వస్త్రం అందించినట్లయితే పాఠశాల ప్రారంభానికి కుట్టించి ఇచ్చేవారు. సకాలంలో రాకపోవడం వల్ల పంపిణీ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
విద్యార్థుల ఇక్కట్లు..
ఎదుగుతున్న పిల్లలు కావడంతో గతేడాది ఇచ్చిన దుస్తులు చిన్నవిగా మారాయి. కొందరివి చిరిగి పోయినా అవే వేసుకుని పాఠశాలలకు వెళ్తున్నారు. వసతి గృహాల్లో ఉండే వారు మరింత ఇబ్బందుల పాలవుతున్నాయి. వెంట తెచ్చుకున్న ఒకటి, రెండు జతలతోనే కాలం వెల్లదీస్తున్నారు. దుస్తుల పంపిణీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
అంతటా అదే పరిస్థితి
జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ , ములుగు జిల్లాల్లో ఎక్కడా కూడా ఏకరూప దస్తులు పంపిణీ చేయలేదు. కుట్టు పనులు జరుగుతున్నాయి. కొన్ని పాఠశాలలకు వస్త్రం కూడా రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో దుస్తుల పంపిణీ కొద్దిగా మెరుగ్గా ఉంది. పలు పాఠశాలల్లో పంపిణీ పూర్తయ్యింది. పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో మాత్రం ఇంకా పంపిణీ చేయలేదు.
పది రోజుల్లో పూర్తి చేస్తాం
జిల్లా వ్యాప్తంగా ఏకరూప దుస్తుల పంపిణీ 60 శాతానికి పైగా పూర్తయింది. మిగతా 40శాతం పంపిణీని ఈ వారం, పది రోజుల్లో పూర్తి చేసేలా అధికారులను సమాయత్తం చేస్తున్నాం. ప్రతీ ఏడాది పాఠశాలల పునఃప్రారంభమైన రోజే పంపిణీ జరిగేది. ఈ సారి బట్ట ఆలస్యంగా రావడం, కుట్టు ఆలస్యం కావడం వల్ల నిర్ణీత సమయంలోపు అందించలేకపోయామని జనగామ విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య తెలిపారు. ఈ పది రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
- ఇదీ చూడండి : అమెరికాలో నరేంద్ర మోదీ సభకు 70వేల మంది!