CONGRESS DHARNA: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగోరోజు పార్టీ శ్రేణులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. పార్టీ అధినేతలపై కేంద్రం కేసులు పెట్టాడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. కాంగ్రెస్ నేతల అరెస్టులను నిరసిస్తూ నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మోదీ విధానాలకు సీఎం కేసీఆర్ వంతపాడుతున్నారని పార్టీ నేతలు విరుచుకుపడ్డారు.
హనుమకొండ జిల్లా పరకాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్, బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ వరంగల్ పోస్ట్ ఆఫీస్ కూడలి వద్ద పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. పార్టీ ఆదరణను చూసి ఓర్వలేకనే కేంద్రం ఈడీ కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ముస్తాబాద్ చౌరస్తా నుంచి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రతిపక్షాలపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందనీ మండిపడ్డారు. మెదక్‌లోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు మౌన దీక్ష చేపట్టారు. ముగిసిపోయిన కేసును మళ్లీ తెరపైకి తెచ్చి నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగే రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకోవడానికి భాజపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో అగ్నిపథ్ పేరిట జరుగుతున్న అల్లర్లకు భాజపా పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
ఇదీ చదువండి: Agnipath effect: అగ్నిపథ్ ఆందోళనలతో 200 రైలు సర్వీసులపై ఎఫెక్ట్..