వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం షాపూర్ గ్రామ శివారులో వనపర్తి-ఖిల్లా ఘనపూర్ రహదారికి సమీపంలో 2011లో బయో మెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సుమారు 10 ప్రభుత్వ వైద్యశాలలు, 131 ప్రైవేటు కళాశాలలు, 13 ఔషద కంపెనీల బయో మెడికల్ వ్యర్థాలను ఈ పరిశ్రమ సేకరిస్తుంది. రోజూ సగటున 949 కిలోల వ్యర్థాలు పరిశ్రమకు వస్తాయి. ఇలా వచ్చిన వాటిని మానవ శరీర భాగాల వ్యర్థాలు, జంతు శరీర భాగాల వ్యర్థాలు, రక్తం, ఇతర ద్రవాలతో కలుషితమైన దూది, డ్రెస్సింగ్, విష వ్యర్థాలు, గడువు ముగిసిన మందులు, మాస్కులు, సిరంజీలు, ఐవీ సెట్లు, గ్లౌజులు, రక్తం, మూత్రం, డయాలసిస్ కిట్లు ఇలా వ్యర్థాల వారిగా వేరు చేస్తారు. అనంతరం వాటిని నిర్ధిష్ట ఉష్ణోగ్రతల మధ్య కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిద సహా ప్లాస్టిక్, గాజు వ్యర్థాలను వేరు చేసి కాలుష్య నియంత్రణ మండలి గుర్తింపు పొందిన సంస్థలకు అప్పగిస్తారు. అక్కడ వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు.
ఇబ్బందులకు గురవుతున్నాం..
పరిశ్రమ నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే పొగ, దుర్వాసన వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని సమీప రైతులు, ఆ రోడ్డు మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా షాపూర్, మానాజీపేట గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురువుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ లోపం..
నిబంధనల మేరకు పరిశ్రమ పేరు, స్వభావం, పరిశ్రమలో ఏం చేస్తారన్న వివరాలతో ప్రజలకు తెలిసేలా పరిశ్రమ ప్రధాన ద్వారం సహా లోపల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పరిశ్రమ వద్ద ఎలాంటి సూచికలు కనిపించడం లేదు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలు హానికరం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వాసన వెదజల్లకుండా చర్యలు చేపట్టాలి. కానీ నిర్వహణ లోపంతోనే పరిశ్రమ నుంచి వచ్చే దట్టమైన పొగ గ్రామాలను తాకుతోందనే ఆరోపణలున్నాయి. మానవ, జంతు సంబంధ శరీర వ్యర్థాలను కాల్చే సమయంలో ఎక్కువ దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
నిబంధనల మేరకే నిర్వహిస్తున్నాం..
కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాము. పరిశ్రమ నుంచి వెలువడే పొగ హానికారకం కాదు. పొగ వల్ల ఎలాంటి దుర్వాసన ఉండదు. మానవ, జంతు శరీర భాగాల వ్యర్థాలను నిర్ణీత ఉష్ణోగ్రతలో దహనం చేస్తాం. పరిశ్రమల వెలుపల కానీ, పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానీ ఎవరూ ఇప్పటి వరకు అనారోగ్యానికి గురి కాలేదు.-ప్రమోద్ రెడ్డి,పరిశ్రమ మేనేజింగ్ పార్ట్నర్
ఇదీ చూడండి: యాదాద్రి బస్టాండ్‌కు 6 ఎకరాలు... ముమ్మరంగా అభివృద్ధి పనులు