ఖరీఫ్ నాటికి సరళా సాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని శంకరంపేట సమీపంలో ఉన్న సరళా సాగర్ ప్రాజెక్టు కట్ట గతేడాది తెగిపోయింది. కట్ట నిర్మాణం పనులు చేపట్టారు. పనులను ఎమ్మెల్యే ఆల, ఎస్ఈ ఉమాపతి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
కరోనా వైరస్ నివారణ ఆంక్షల మూలంగా పనులు ఆలస్యమయ్యాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. 45 రోజుల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి సరళా సాగర్ కింద ఉన్న 4 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కొత్తకోట మున్సిపాలిటీలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు.