వనపర్తి జిల్లా ఆస్పత్రిలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన డ్రై రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ యాస్మిన్ భాషా ప్రారంభించారు. వ్యాక్సిన్ వేయించుకునే వారి వివరాల నమోదు, పరిశీలన గది, టీకా కార్యక్రమం తర్వాత వేచి ఉండే గదులను పరిశీలించారు. జిల్లా మొత్తంగా 15 కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు. .
డ్రై రన్ కార్యక్రమం పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా వైద్య సిబ్బందికి అవగాహన కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో 25 మంది చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
టీకా పొందేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ముందుగా కోవిన్ యాప్ ద్వారా పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. టీకా ఎక్కడ వేస్తారనే సమాచారం ఫోన్లకి సందేశం వస్తుందని కలెక్టర్ తెలిపారు. చరవాణికి వచ్చిన సంక్షిప్త సమాచారం ప్రకారం ప్రతి ఒక్కరూ ఆయా కేంద్రాన్ని సందర్శించి టీకా పొందాలన్నారు.
వ్యాక్సినేషన్‌కు కావలసిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు 2,884 వారి పేర్లను ఇప్పటికే నమోదు చేసుకున్నారని వెల్లడించారు.
జిల్లాలో డ్రై రన్ కేంద్రాలు:
- 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
- 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
- 1 పీపీ యూనిట్
- 1 జిల్లా ఆస్పత్రి
ఇదీ చదవండి: కోవిన్ యాప్: ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..